సాహిత్య సదస్సులు
తెలుగు సాహిత్యం - భారతీయ సంస్కృతి
Updated: Mar 21
అంతర్జాల అంతర్జాతీయ సదస్సు
అచ్చపు చీకటిండ్ల పొరలాడుచునుండ ప్రపంచమెల్ల నీ
పచ్చని తల్లి గుమ్మము లపై వెలిగెం మణిదీపికల్ కనన్
వచ్చిన ఖండ ఖండముల వారికి కోరిక తీరునట్లుగా
బిచ్చము పెట్టె భారత సవిత్రి ప్రియంబున రెండు చేతులన్ - స్వచ్ఛంద జాతి, జంధ్యాల పాపయ్య శాస్త్రి మానవుడు అనాగరిక దశ నుండి నాగరిక దశ వైపు చేసే ప్రయాణంలో ఏర్పరచుకున్న నియమ నిబంధనలు తర్వాతి కాలంలో సంస్కరించబడి అనంతరం ఆ జాతి సంస్కృతి గా పరిణామం చెందుతాయి. సంస్కృయతే ఇతి సంస్కృతం. సంస్కరింపబడిన తత్వం గలది సంస్కృతి. ఒక జాతికి సంబంధించి సంస్కరించబడిన ఏ ఆచార వ్యవహారమైనా అది ఆ జాతి సంస్కృతిగా రూఢిలో ఉంటుంది. మానవ పరిణామ క్రమంలో మనిషి సంచార ఆటవిక స్థితి నుంచి స్ధిర నివాస స్థితి మీదుగా జానపదాన్ని స్పృశిస్తూ నాగరికత వైపు పయనించాడు. ఈ పరిణామ క్రమంలో ఆహార,భయ నిద్రాది అవస్థలలో జంతు స్థితి కంటే భిన్నంగా మానవత్వాన్ని పొందే క్రమంలో తనని తాను ఉద్ధరించుకోడానికి కొన్ని నియమ నిబంధనలు విధించు కున్నాడు. ఆ నియమ నిబంధనలే కాలానుగుణంగా మరింత మెరుగై ఆచారవ్యవహారాలుగా మారి సంస్కృతిగా స్థిరపడ్డాయి. ఆ సంస్కృతి ఎప్పుడూ ప్రస్తుత తరానికి మార్గ దర్శనం చేస్తూ మనిషిని కాపాడే విధంగా ఉంటుంది. ఒక జాతికి మార్గదర్శకంగా నిలిచి మరింత నైతిక బలాన్ని సమాజానికి అందిస్తుంది. సంస్కృతి ఒక్కో జాతికి ఒక్కో విధంగా ఉంటుంది. సాధారణంగా ఒక జాతి సంస్కృతి ఆ జాతి మత పునాదులపై ఆధారపడుతుంది. ఒక జాతి అనుసరించే మత ఆచార వ్యవహారాల నుంచి ఆ జాతి సంస్కృతి ఏర్పడుతుంది. భారతదేశంలో అనేక జాతులు, భిన్న మతస్థులు నివసిస్తున్నారు కనుక భారతీయ సంస్కృతిలో భిన్నత్వం కనిపిస్తుంది. ఈ సంస్కృతులలో పూర్తి ఏకత్వం లేకున్నా ప్రతి సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యం మరొక సంస్కృతిని ఆదరించడం గౌరవించడం.కనుకనే ఎన్ని భిన్నమైన సంస్కృతులు భారతదేశంలో ఉన్నా భిన్నత్వంలో ఏకత్వంలా కలిసి నివసిస్తున్నారు. సంస్కృతి శబ్దానికి సంస్కారం, నాగరికత అన్న రెండు అర్థాలు కనిపిస్తున్నాయి.ఒక వ్యక్తి యొక్క సంస్కారం ఆ వ్యక్తికి సంబంధించిన జాతి యొక్క సంస్కృతి నుంచి పుడుతుంది. కాబట్టి ఒక జాతి ఆధ్యాత్మికమైన ఎదుగుదలను సంస్కృతిగా భౌతికమైన ఎదుగుదలను నాగరికతగా చెప్పవచ్చు.
సంస్కృతి ఒక జాతి జీవన విధానం. భాషా సాహిత్యాలు ఆ సంస్కృతిని ప్రతిబింబించే సాధనాలు.నాగరికత ఆ జాతి వ్యక్తం చేసే ఆచార వ్యవహారం. జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీ చెప్పిన విధంగా ప్రపంచమంతా అంధకారంలో మగ్గుతున్న సమయంలో అత్యున్నతమైన నాగరికతా సంప్రదాయాలను ప్రదర్శించిన సంస్కృతి భారతీయ సంస్కృతి. ఏ భాషా సాహిత్యమైనా ఆ జాతి జీవన విధానాన్ని తప్పకుండా ప్రతిఫలిస్తుంది. తెలుగు భాషా సాహిత్యం కూడా అందుకు మినహాయింపేమీ కాదు. తెలుగు సాహిత్యం మొదలైన క్షణం నుంచి ఈనాటి వరకు తెలుగు సాహిత్యం తెలుగువారి సంస్కృతీ నేపథ్యాన్ని, సాంస్కృతిక ఔన్నత్యాన్ని, నాగరికతను, తెలుగుజాతి పరిణామక్రమాన్ని అడుగడుగునా ప్రస్తావిస్తూ తెలుగు సాహిత్యానికి పరిపూర్ణతను పరిపుష్టిని చేకూరుస్తోంది.అటువంటి తెలుగు సాహిత్యంలో భారతీయ సంస్కృతి ఏవిధంగా ప్రతి ఫలిస్తోందో కూలంకషంగా చర్చించడం ఈ అంతర్జాల అంతర్జాతీయ సదస్సు యొక్క ముఖ్యోద్ద్యేశ్యం.

#BusinessStrategy #HintsampTips
