top of page
image_search_1593084678622.jpg

సాహితీ "కౌసల్యం"

​నెల నెలా మీ నెట్టింట్లో 

​సాహితీ కౌసల్యం
నెల నెలా సాహిత్య చర్చ 

నెల్లూరు నగరంలో కీర్తి ప్రతిష్టలతో అలరారుతున్న కళాశాలలో ప్రథమ స్థానంలో ఉన్న కళాశాల దొడ్ల కౌసల్యమ్మ స్వయంప్రతిపత్తి ప్రభుత్వ మహిళా కళాశాల. మహిళాభ్యుదయం కోసం 1964లో శ్రీ దొడ్ల కౌసల్యమ్మ వితరణంతో ఏర్పడిన ఈ కళాశాల దినదిన ప్రవర్ధమానమై నేటికీ ఉన్నత విలువలతో ఉత్తమ ఫలితాలతో అలరారుతోంది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ కళాశాలలో తెలుగు శాఖ కూడా ఒకటి. కళాశాల స్థాపించబడిన నాటినుంచి తెలుగుశాఖ ఏర్పడి ప్రత్యేక తెలుగు గ్రూప్ తో ఎంతో మంది మహిళలకు జీవనాధారంగా నిలిచింది. నిలుస్తోంది. తెలుగు శాఖ కళాశాల కీర్తిని ఇనుమడింపజేయడంలో కీలకపాత్ర వహిస్తూ అటు విద్యార్థులకు ఇటు సమాజానికి తన వంతు భాషా సాహిత్య సేవల్ని అందిస్తూనే ఉంది. ఈ శాఖ నుంచి ఎన్నో సదస్సులు కార్యశాలలు నిర్వహించబడ్డాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ నిధుల సహాయంతో సదస్సులను, ప్రాజెక్టులను చేయడం కూడా జరిగింది. ఈ కరోనా సమయంలో కూడా తెలుగు శాఖ భాషా, సాహిత్యాల పరిశోధనలో తన వంతు కృషిని చేస్తూనే ఉంది. ఈ కరోనా కాలంలో అందరూ ఇంటికే పరిమితమై ఉన్న వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా అంతర్జాల సదస్సును కళాశాల తెలుగు విభాగం నిర్వహించింది. గత రెండు నెలలుగా ఒక జాతీయ, ఒక అంతర్జాతీయ సదస్సులతోపాటు, పరిశోధనా పద్ధతులపై ఒక కార్యశాలను కూడా నిర్వహించింది. అంతేగాక నెల్లూరు నగరంలో ఉన్న అనేక తెలుగు సాహిత్య సంస్థలలో క్రియాశీలక భాగస్వామ్యతను కూడా వహిస్తోంది. అవి నిర్వహించే తెలుగు భాషాభివృద్ధి కార్యక్రమాలలో తెలుగుశాఖ విద్యార్థులు పాల్గొనడమే కాకుండా అనేక బహుమతులు, ప్రశంసా పత్రాలు కూడా పొందుతున్నారు. పద్య పఠనం, వ్యాసరచన, కథారచన, కవితా రచన, పోటీ ఏదైనా సరే ప్రత్యేక తెలుగు విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూనే ఉన్నారు. అలాంటి విద్యార్ధులకు సాహిత్యాన్ని మరింత చేరువ చేయాలన్న ఆలోచనతో దొడ్ల కౌసల్యమ్మ పేరు మీదుగా 'సాహితీ కౌసల్యం' అన్న వేదికను ఏర్పాటు చేసి ప్రతి నెల ఒక సాహిత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భావించి, అందులో భాగంగా ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు సాహితీ వేదిక మొదటి కార్యక్రమం zoom app ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సి.హెచ్.మస్తానయ్య గారు, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం కుల సచివులు డాక్టర్ ఎల్.వి.కె.రెడ్డిగారు, ప్రసిద్ధ సినీ గేయ రచయిత శ్రీ వెన్నెలకంటి గారు, తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్ కరుణశ్రీ, డాక్టర్ దివిజ దేవి, డాక్టర్ పద్మప్రియ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2021-10-20 at 09.02.31.jpeg

సాహితీ 'కౌసల్యం'

సాహితీ వేదిక 

దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల(స్వయం)

కింది youtube ఛానెల్లో ఈ వేదిక ద్వారా  నిర్వహించే  అన్ని కార్యక్రమలనూ వీక్షించ వచ్చు. ఛానెల్ sub scribe చేయండి. తెలుగు భాషా, సాహిత్యాలను ప్రోత్సహించండి. 

​సినీ సాహిత్యంపై వెన్నెలకంటి 

vennelakanti brocher.jpg

నగరంలోని దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల వారు "సాహితీ కౌసల్యం" అనే పేరుతో ప్రారంభించిన సాహిత్య వేదికను కళాశాల అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ మస్తానయ్య గారి అధ్యక్షతన, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ కుల సచివులు డాక్టర్ ఎల్ విజయ కృష్ణారెడ్డిగారు, ప్రసిద్ద గేయ రచయిత శ్రీ వెన్నెలకంటిగారు ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు వాస్తవ్యులైన ప్రముఖ సినీ రచయిత శ్రీ వెన్నెలకంటి గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాహిత్య వేదిక ప్రారంభ కార్యక్రమంగా "వెన్నెలకంటి గారితో ముఖాముఖి" ని కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు డా. కె. కరుణశ్రీ గారు నిర్వహించారు. జూమ్ యాప్ మాధ్యమంగా జరిగిన ఈ కార్యక్రమంలో వెన్నెలకంటి గారు శ్రోతలతో తమ అంతరంగాన్ని పంచుకున్నారు. వృత్తిపరంగా, గేయ రచయితగా, మాటల రచయితగా తమ అనుభవాల్ని పంచుకుంటూనే సినీరంగానికి భిన్నంగా సినిమా ప్రవేశానికి ముందే తనకోసం తాను రాసుకున్న శతకాల గురించి కూడా ప్రస్తావించారు. సినిమా పాటల్లో అర్ధాలంకారం కంటే శబ్దాలంకారం ప్రాధాన్యత వహిస్తోందని, ఈ రెండింటి కంటే భావం మరింత ముఖ్యమనీ రచయిత ఇష్టం కంటే కూడా నిర్మాత అవసరం ముఖ్య పాత్ర పోషిస్తుందనీ, ఒక్కొక్కసారి రచనా వేగం కూడా అవసరమవుతుందనీ, ఇంకా రచయితకు ఉండవలసిన మరెన్నో విషయాల్ని ప్రస్తావించారు. ఇందులో భాగంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో తనకున్న అనుబంధాన్ని, వేటూరి, ఆత్రేయ పై తనకున్న పూజ్య భావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చివరిగా కొందరు శ్రోతలు అడిగిన సందేహాలకు వెన్నెలకంటి వారు మనసు విప్పి సమాధానాలు .ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల తెలుగు శాఖలోని సహాయ ఆచార్యులు డాక్టర్ దివిజాదేవి, డాక్టర్ పద్మ ప్రియ, గార్లు పాల్గొన్నారు

ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్ర సంచాలకులు

ఆచార్య మునిరత్నం నాయుడు

muniratnam.jpg

ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాషా వికాసం అనే ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ మస్తానయ్య గారు,విశిష్ట అతిధిగా ఉన్నత విద్యాశాఖ సంయుక్త సంచాలకులు డా.వి.పాపయ్య శాస్త్రి గారు, ముఖ్య అతిధిగా ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య డి.మునిరత్నం నాయుడుగారు పాల్గొన్నారు. గూగుల్ మీట్ యాప్ మాధ్యమంగా జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా సిహెచ్. మస్తానయ్య గారు మాట్లాడుతూ చిన్నతనంలో నేర్చుకున్న పద్యం ఇప్పటికీ గుర్తుండడానికి కారణం పద్యపఠనా విధానమేనని తెలియజేసారు. డా.వి.పాపయ్య శాస్త్రి గారు మాట్లాడుతూ జీవితం వేగవంతమైనది ఏ కాలంలోనైనా సమాజమే సాహిత్యంలో ప్రతిబింబిస్తుందని, తెలుగు సాహిత్యం మీద ఆంగ్ల సాహిత్య ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. ఆచార్య మునిరత్నం నాయుడు గారు మాట్లాడుతూ తెలుగేతర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారికన్నా తెలుగు భాషా సాహిత్యాల వికాసం కోసం ఎక్కువ కృషి చేస్తున్నారని దాని గురించి వివరించారు. తెలుగు ప్రాంతాలకు సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సాలతో పాటు ఉత్తర భారతంలోని గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, అస్సాం రాష్ట్రాలలో జరుగుతున్న తెలుగు భాషా బోధన గురించి, జెరూసెలెమ్, మారిషస్, మలేషియా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లో జరుగుతున్న తెలుగు భాషా వికాసం, వాటిని నిర్వహిస్తున్న సంస్థల  గురించి వివరించారు. అమెరికాలో ఒక్క సిలికానాంధ్ర ఆధ్వర్యంలో 'మన బడి' పేరు మీద శాఖలు ఉన్నాయని, అందులో రెండు వేల మంది స్వచ్చంద బోధకులు దాదాపు 55 వేల మంది విద్యార్థులకు తెలుగు నేర్పిస్తున్నట్లుగా తెలియజేశారు. అంతేకాక మారిషస్లో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలుగును ప్రధానంగా బోధిస్తుందని తెలియజేశారు. ప్రత్యేకించి దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీలో చదువుతున్న పది  వేల మందికి పైగా హిందీ భాషా వ్యవహర్తల కోసం 1 నుండి 8వ తరగతి వరకు తెలుగు వాచకాలు, ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న నవోదయ విద్యాలయ సమితి కోసం ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు తెలుగు వాచకాలను మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం డైరెక్టర్ హోదాలో తాను తీసుకురావడం జరిగిందని వివరించారు. దీంతో పాటు ఇటీవల ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి చొరవతో నెల్లూరుకు తరలి వచ్చిన ప్రాచీన విశిష్ట తెలుగు అధ్యయన కేంద్రం డైరెక్టర్ గా అక్కడ జరుగుతున్న అనేకానేక తెలుగు భాషా వికాస కార్యక్రమాల గురించి వీరు ఈ సదస్సులో వివరించారు. కార్యక్రమానంతరం శ్రోతలు అడిగిన అనేక సందేహాలకు వారి వివరణ ఇచ్చారు. తెలుగు శాఖ సహాయ ఆచార్యులు డా.కరుణశ్రీ మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు వాడు ఎదిగినంతగా తెలుగు భాష ఎదగ లేదన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల తెలుగు శాఖలోని ఇతర సహాయ ఆచార్యులు దాక్టరు దివిజాదేవి, డాక్టర్ పద్మ ప్రియ గార్లు పాల్గొన్నారు

సాహితీ కౌసల్యం - 3.jpg

​నాటక సాహిత్య విమర్శ గురించి డా. లక్ష్మణ చక్రవర్తి 

డి.కె. సాహిత్య కౌసల్యంలో మహర్షి బాదరాయణ వ్యాస సమ్మాన్ అవార్డు గ్రహీత డా.లక్ష్మణ చక్రవర్తి తెలుగు నాటక సాహిత్య విమర్శ మీద ప్రసంగించారు. నాటక సాహిత్య విమర్శ మీద జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.సిహెచ్.మస్తానయ్య గారు మాట్లాడుతూ నాటకాలకు ఒకప్పుడు విపరీతమైన ఆదరణ ఉండేదని అది ఇప్పుడు తగ్గిందని దానికి కారణాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ప్రధాన వక్త లక్ష్మణ చక్రవర్తి గారు మాట్లాడుతూ సమకాలీన సమస్యల ఇతివృత్తంతో నాటకాలు ఎక్కువగా రాకపోవడం,నాటక స్థానాన్ని టీవీ సీరియల్స్ సినిమాలు ఆక్రమించడం వల్ల నాటకానికి ఆదరణ తగ్గిందన్నారు.వారు తెలుగు నాటక సాహిత్య విమర్శ ఏ రకంగా ఎదిగిందో వివరిస్తూ, అనేక నాటక సాహిత్య విమర్శ గ్రంథాలను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు డా.కరుణశ్రీ, డా.దివిజా దేవి, డా.పద్మ ప్రియ పాల్గొన్నారు. 

సాహితీ కౌసల్యం -4.jpg

జానపదమే జ్ఞానపదం

ఆచార్య ఆర్వీస్. సుందరం    

ఈ రోజు డి.కె.సాహితీ కౌసల్యంలో జూమ్ యాప్ ద్వారా ప్రముఖ జానపద పరిశోధకులు ఆర్వీయస్ సుందరం గారు జానపదుల అనుభవం - అభివ్యక్తి మీద ప్రసంగించారు. జానపద సాహిత్యం మీద జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.సిహెచ్.మస్తానయ్య గారు మాట్లాడుతూ జానపద సాహిత్యం ఒక జాతి జీవనాడి అని పేర్కొన్నారు ప్రధాన వక్త ఆచార్య.ఆర్వీ యస్. సుందరం గారు మాట్లాడుతూ జానపదమే జ్ఞానపదమని, శిష్ట సాహిత్యం బురదలో వెళ్లే పడవ లాంటిదని, దాని జాడలు ఎక్కడో ఒకచోట కనిపిస్తాయని, జానపద సాహిత్యం సెలయేటి నీళ్ళలో వెళ్లే పడవ లాంటిదని, దాని ముద్రలు ఎక్కడా కనిపించని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు డా.కరుణశ్రీ, డా.దివిజా దేవి, డా.పద్మ ప్రియ పాల్గొన్నారు.

purnachand WhatsApp Image 2021-06-09 at

​తెలుగువారి ఆహార చరిత్ర 

డా. జి.వి. పూర్ణచందు 

అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. భోజనం చేయగల శక్తి కూడా ఆయుర్వేదం ప్రకారం తపఃఫలమే. ఆ తపః ఫలం ఉన్నవారు షడ్రసోపేత భోజనం చేసే శక్తిని పొందితే ఆ తపః ఫలం లేనివారు తినే యోగ్యత లేక అనేక జబ్బులతో బాధ పడుతుంటారు. అలాంటి షడ్రసోపేత భోజనంలో ఏం తింటే మంచిది. మన పూర్వీకులు ఏం తిన్నారు. మన సాహిత్యంలో ఆహార చరిత్ర ప్రస్థానం ఏ విధంగా ఉంది లాంటి  విషయాలు,      సాహిత్య కళారత్న డా. జి.వి.పూర్ణచందుగారి మాటల్లో

నన్నయ్య భారతం - ధ్వని 

salaka WhatsApp Image 2021-06-09 at 18.0

​ఆచార్య శలాక రఘునాథ శర్మ 

కావ్యానికి ఆత్మ రీతా, వక్రోక్తా, రసమా, ఔచిత్యమా, అలంకారమా, ధ్వనా అనేటటువంటి దాని గురించి భారతీయ ఆలంకారికులు అనేక చర్చలు చేశారు. కావ్యానికి ఆత్మ ధ్వని అనే సిద్ధాంతాన్ని మనకు ఆనందవర్ధనుడు ప్రతిపాదించాడు. ఈ ధ్వని సిద్ధాంతానికి మూలం స్పోటనాదం. ప్రధానంగా మహాభారతానికి దీన్ని అన్వయించేటప్పుడు నన్నయ్యది వస్తుధ్వని అని, తిక్కనది రసధ్వని అని, ఎర్రనది అలంకార ధ్వని అని విమర్శకులు చెప్తారు. నన్నయలో  వస్తధ్వని ఏవిధంగా ధ్వనిస్తుందో మహామహోపాధ్యాయ ఆచాల్య శలాక రఘునాథ శర్మగారు ఈ ఉపన్యాసంలో వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు డా.కరుణశ్రీ, డా.దివిజా దేవి, డా.పద్మ ప్రియ పాల్గొన్నారు.

endluri WhatsApp Image 2021-06-09 at 18.

​నాలోకి నేను 

​ఆచార్య ఎండ్లూరి సుధాకర్ 

కవిగా, వ్యక్తిగా, తెలుగు పాఠకలోకానికి పరిచయం అవసరం లేని వ్యక్తి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు. ఆయన ఆత్మకథ 'ఒక వీరుని చరిత్ర' ఎన్నో మనసులకు ప్రేరణ. ఎన్నో తరాలకు స్ఫూర్తి. తాత ముత్తాతలు చేసిన శ్రమకన్నా కవిత్వం రాయడం చాలా సులభం అని నిర్ద్వంద్వంగా ప్రకటించిన నిరాడంబర కవి. అటువంటి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారి ప్రస్థానం గురించి ఆయన మాటల్లోనే ....

kopparthi WhatsApp Image 2021-06-09 at 1
తిలక్ కవిత్వంలో బాహుళత్వం 

​కొప్పర్తి వేంకట రమణ మూర్తి 

సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తూ, అకుంఠితమైన మానవీయ పతాకను ఎగరేస్తూ, ప్రపంచ మానవాళికి తన కవిత్వం ద్వారా స్నేహ సేతువును నిర్మించిన కవి దేవరకొండ బాల గంగాధర తిలక్ గారు. అమానవీయ సంఘటనలకు చలించిపోయి, ఆ అనుభూతిని ఒక అద్భుతమైన శబ్దశక్తి, అలంకారపుష్టి, భావుక నైపుణ్యంతో వ్యక్తం చేసిన ఉన్నత శ్రేణి కవి తిలక్.  ఆయన కవిత్వమే కాదు ఆయన కథలు కూడా సమాజపు ఆనవాళ్ళే. అంతటి గొప్ప భావాభ్యుదయ కవి తిలక్ గారి  గురించి ఆయన కవిత్వం గురించి శ్రీ కొప్పర్తి వెంకటరమణ మూర్తి గారి మాటల్లో...

ramana rao WhatsApp Image 2021-06-09 at

​ఆధునిక తెలుగు కవిత్వం తీరుతెన్నులు 

​డా. కె. వి. రమణరావు 

మానవుని హితంతో కూడుకున్నది సాహిత్యం. సాహిత్యం సమాజ హితాన్ని, సమాజ ప్రతిఫలనాన్ని తప్పకుండా కలిగి ఉంటుంది. ఈ రెండింటిలో ప్రాచీన సాహిత్యానికి ఆధునిక సాహిత్యానికి కొంత తేడా ఉండవచ్చు. ప్రాచీన సాహిత్యంలో సామాన్యుడు కొంత కనుమరుగైనా పూర్తిగా మాత్రం కాదు. ఆధునిక సాహిత్యం అర్థం కాలేదంటే ఆధునిక జీవితం అర్థం కాలేదని అర్ధం అంటారు శ్రీశ్రీ. అటువంటి ఆధునిక తెలుగు కవిత్వపు పరిణామం, తీరుతెన్నుల గురించి డా.కె.వి. రమణ రావు గారు విశ్లేషించారు.

aleti WhatsApp Image 2021-06-09 at 19.33

తెలుగులో సమాసాలు 

డా. ఆలేటి మోహన్ రెడ్డి  

వేరు వేరు అర్థాలు గల పదాలు ఒకే అర్థం వచ్చునట్లు ఏకమవడం సమాసం. సాధారణంగా సమాసంలో రెండు పదాలుంటాయి. మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చిన ఈ సమాసాల గురించి డా.ఆలేటి మోహన్ రెడ్డిగారు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు డా.కరుణశ్రీ, డా.దివిజా దేవి, డా.పద్మ ప్రియ పాల్గొన్నారు.

uma WhatsApp Image 2021-06-09 at 19.41.0

​మహాభారతంలో గీతలు 

డా. ఎస్.ఎల్.వి. ఉమామహేశ్వరరావు 

గీత అనే దానికి అనేక మంది అనేక విధాలుగా వ్యాఖ్యానం చేశారు. ఏదైనా సందేహానికి అసత్యానికి తావు లేని ఒక సంపూర్ణ వాక్యం లేదా వ్యాఖ్యానం గీత. గీతల యొక్క అవసరం మనకు అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. మహాభారతంలో గీత అనగానే మనకు తెలిసింది తోచేది భగవద్గీత మాత్రమే. కానీ మహాభారతంలో అనేక సందర్భాల్లో అనేక గీతలు ఉన్నాయి. అనేక ధర్మసూక్ష్మాలు ఉన్నాయి. ఆ గీతలన్నీ ఏ సందర్భంలో ఎవరు ఎవరితో చెప్పారో ఏ ధర్మసూక్ష్మాలను ఎందుకు బోధించారో డా.ఎస్.ఎల్.వి.ఉమామహేశ్వరరావుగారి మాటల్లో...​

​శైలీ శాస్త్ర పరిచయం 

​ఆచార్య పరిమి రామనరసింహం 

శైలిని ఆంగ్లంలో style అంటారు. లోకంలో ప్రతి వ్యక్తికీ, ప్రతి జీవికీ ఒక ప్రత్యేకశైలి ఉంటుంది. అదేసాహిత్య పరంగా శైలి అనే పదం అభివ్యక్తికి సంబంధించినది. ముఖ్యంగా భాషకు సంబంధించినవి. ఈ శైలి అనేది నన్నయ్య దగ్గర నుంచి నేటి ఆధునిక కవి వరకు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ప్రత్యేక శైలి ఉన్న వారే గొప్పకవులు అవుతారు. అల్లసాని వారి అల్లిక జిగిబిగి, ముక్కుతిమ్మనార్య ముద్దు పలుకు, పాంగరంగవిభుని పదగుంభనంబు ఇవన్నీ వారి వారి శైలీ ప్రత్యేకతలే. శ్రీనాథుడు చెప్పిన వేములవాడ భీమనగారి ఉద్దండలీల, నన్నయ్యగారి ఉభయవాక్ప్రౌడి, తిక్కనగారి రసాత్యచిత బంధం, ఎఱ్ఱనగారి సూక్తి వైచిత్రి వీటన్నింటినీ శైలిలో భాగంగానే చెప్పవచ్చు. వీటన్నింటి గురించి లోతుగా అధ్యయనం చేసేదే శైలీ శాస్త్రం. అంతా తెలిసినట్టు ఉంటూనే ఏమీ తెలియని ఈ శాస్త్ర రహస్యాల్ని ఈ రంగంలో విశేష కృషి చేసి మహాభారతంలోని శైలీ విధానాన్ని పుస్తకరూపంలో తెచ్చిన ప్రముఖ భాషా వేత్త ఆచార్య పరిమి రామనరసింహంగారు. వారి పూర్తి ఉపన్యాసం కింది యూట్యూబ్ లంకెలో..... 

పద్యం చదవడం / పాడడం ఎలా ?

శ్రీ కోరుకొండ ప్రసాదరాయ శాస్త్రి 

పద్యాన్ని పాడడం అనేది ఒక కళ. పద్యాన్ని భావయుక్తంగా పాడడం అనేది అందరికీ రాదు. పాటకు, మాటకు మధ్య ఉండేది పద్యం. అంటే పాడడానికి, మాట్లాడడానికి మధ్యలో పద్యం ఉండాలి. అలాంటి పద్యాన్ని ఎలా చదివితే బాగుంటుంది. ఏ పద్యాన్ని ఏ రాగంలో చదవాలి, ఎలా చదివితే శ్రోతల్ని, విద్యార్థుల్ని ఆకట్టుకోవచ్చు లాంటి విషయాల్ని ప్రముఖ రంగస్థల నటులు, నంది అవార్డు గ్రహీత కోరుకొండ ప్రసాదరాయ శాస్త్రి గారి మాటల్లో తెలుసుకుందాం. పూర్తి ఉపన్యాసం కింది యూట్యూబ్ లంకెలో....

సాహితీ కౌసల్యం-14_page-0001_edited.jpg

తెలుగులో సమాసాలు 

డా. ఆలేటి మోహన్ రెడ్డి  

వేరు వేరు అర్థాలు గల పదాలు ఒకే అర్థం వచ్చునట్లు ఏకమవడం సమాసం. సాధారణంగా సమాసంలో రెండు పదాలుంటాయి. మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చిన ఈ సమాసాల గురించి డా.ఆలేటి మోహన్ రెడ్డిగారు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు డా.కరుణశ్రీ, డా.దివిజా దేవి, డా.పద్మ ప్రియ పాల్గొన్నారు.

bottom of page